బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు జూలై 11న కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణ చేస్తున్న కమిషన్ ఎదుట హాజరయ్యారు. చీఫ్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో జరుగుతున్న కమిషన్ విచారణకు హాజరై, ప్రాజెక్ట్‌కు సంబంధించి కీలకమైన పలు ఆధారాలను, డాక్యుమెంట్లను సమర్పించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు ఆరు సార్లు క్యాబినెట్ ఆమోదం పొందాయని, అసెంబ్లీలో మూడు సార్లు ఆమోదించారని తెలిపారు. హరీష్‌రావు మాట్లాడుతూ, ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం తమ వద్ద ఉన్నా, మిగిలిన సమాచారం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవ్వాల్సిందని స్పష్టంచేశారు. అయితే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కమిషన్‌కు పూర్తి సమాచారం అందించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ చేసిన ఆరోపణలన్నీ అసత్యాలు, అపప్రచారమేనని మండిపడ్డారు. ప్రజా భవన్‌లో ఇచ్చిన ప్రజెంటేషన్ పవర్ పాయింట్ కాదు, కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లుగా మోసాలే చేసిందని, ఇప్పుడు అదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తోందన్నారు. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ తీరును హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే 299 టీఎంసీలపై ఒప్పందం జరగిందని గుర్తుచేశారు. సెక్షన్ 3 కింద నీటి హక్కులను సాధించేందుకు కేసీఆర్ పోరాటం చేశారని, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం 299 టీఎంసీల ఒప్పందంపై సంతకాలు చేశారని తెలిపారు. అప్పటి ఒప్పందం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని, ఇప్పుడు దాని బాధ్యతను బీఆర్ఎస్ మీద వేయడం సమంజసం కాదని విమర్శించారు.
తుమ్మడిహెట్టి నుంచి బ్యారేజ్ మార్పుపై కేంద్రానికి ప్రశ్నలు వేయాలని సూచించారు. రేవంత్ ప్రభుత్వం 20 నెలల్లో ఒక్క చెరువు అయినా కట్టించిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో నీటిని తక్కువగా వాడారని, పంటల పెరుగుదల కనబడలేదని అన్నారు. అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధమేనని, తమ మైక్ కట్ చేయకుండా ప్రజల ముందు నిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించకుండా, నిజాలను వెల్లడించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.
Read More : బీసీలకు 42% రిజర్వేషన్ హర్షణీయం: ఆది శ్రీనివాస్
