కూకట్‌పల్లిలో కల్తీ కల్లు కలకలం

హైదరాబాద్‌ శివార్లలోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు విషాదానికి దారి తీసింది. హెచ్‌ఎంటీ హిల్స్‌ సాయిచరణ్ కాలనీలో నివసించే ముగ్గురు వ్యక్తులు కల్తీ మద్యం సేవించి మృతిచెందారు. మృతులను తులసిరామ్‌ (47), బొజ్జయ్య (55), నారాయణమ్మ (65)గా గుర్తించారు. వీరిలో ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా, మరొకరు ఇంట్లోనే మరణించారు. ఈ కల్తీ కల్లు తాగిన ఘటనలో మొత్తం 15 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను సమీపంలోని రాందేవ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్నవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కల్తీ కల్లు విక్రయిస్తున్న దుకాణాన్ని శేరిలింగంపల్లికి చెందిన ఓ కాంగ్రెస్ నేత నడుపుతున్నారని తీవ్రంగా ఆరోపించారు.

ఈ దుర్ఘటనపై స్థానికులలో తీవ్ర ఆందోళన నెలకొంది. అధికారులు విచారణ చేపట్టి కల్తీ కల్లు సరఫరా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read More : గుజరాత్ వంతెన కూలిన ఘటనపై కేటీఆర్ ఘాటు విమర్శలు

One thought on “కూకట్‌పల్లిలో కల్తీ కల్లు కలకలం

Comments are closed.