పాకిస్థాన్‌లో వర్షాల తాకిడి: 72 మంది మృతి

పాకిస్థాన్‌ను రుతుపవన వర్షాలు తాకుతూ పెను విషాదాన్ని మిగిలించాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా పలు ప్రావిన్సులు భారీ వరదల బారినపడ్డాయి. జూన్ 26 నుంచి జూలై 6 వరకు కురిసిన వర్షాల దెబ్బకు ఇప్పటివరకు 72 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారి సంఖ్య 130 దాటింది. మరణించినవారిలో 28 మంది చిన్నారులు ఉండటంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
వరదల ప్రభావంతో పంజాబ్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా, సింధ్‌ ప్రావిన్సులు అతలాకుతలమయ్యాయి. ఈ ప్రాంతాల్లో వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రత్యేకంగా బలూచిస్థాన్‌లో 15,000కు పైగా గృహాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) ప్రకటించింది. వ్యవసాయ భూములు నీట మునిగిపోవడంతో పంటలు నాశనమయ్యాయి. పాఠశాలలు, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. అనేక గ్రామాలు మౌలిక వసతుల్లేక నరకాన్ని అనుభవిస్తున్నాయి.

పంజాబ్ ప్రావిన్స్‌లో సట్లెజ్ నది ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తు హెచ్చరికలతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు లక్ష మందిని అక్కడి నుంచి ఖాళీ చేయించినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సహాయక బృందాలు ముమ్మర చర్యలు చేపడుతున్నాయి. వాతావరణ శాఖ ఇంకా కొద్దిరోజులపాటు వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More : Tesla : ఎలాన్ మస్క్ రాజకీయ ప్రకటన ప్రభావం…

One thought on “పాకిస్థాన్‌లో వర్షాల తాకిడి: 72 మంది మృతి

Comments are closed.