పాకిస్థాన్‌లో పెంపుడు సింహం దాడి

పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో ఓ ఘోర ఘటన చోటుచేసుకుంది. ఇంటి గోడ దూకి బయటకు వచ్చిన పెంపుడు సింహం, వీధిలో షాపింగ్ చేసుకుని వస్తున్న ఓ మహిళపై దాడికి పాల్పడింది. ఆ దాడిలో ఆమెతో పాటు ఉన్న ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకోగా, దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల కథనం ప్రకారం, 11 నెలల వయసున్న సింహం ఇంటి గోడ దూకి ఓ రద్దీ వీధిలోకి వచ్చింది. ఆ సమయంలో అక్కడ షాపింగ్ ముగించుకుని ఇంటికెళ్లుతున్న మహిళను వెంబడించి, ఆమెపై దూకింది. మహిళను కిందపడేసిన తర్వాత ఆమె పిల్లలైన ఐదేళ్ల, ఏడేళ్ల చిన్నారులపై కూడా దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురికీ ముఖం, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాడి జరుగుతున్న సమయంలో సింహం యజమానులు తమ ఇంటి వద్ద నుంచి బయటకు వచ్చి దానిని చూస్తూ నవ్వుతూ ఉండటం గమనార్హం. బాధితురాలి భర్త ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన అనంతరం సింహ యజమానులు అక్కడి నుంచి పారిపోగా, పోలీసులు 12 గంటల్లోనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. సింహాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

పంజాబ్ ప్రావిన్స్‌లో సింహం లాంటి వన్యప్రాణులను హోదా గుర్తుగా పెంచే సంప్రదాయం కొనసాగుతోంది. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. లైసెన్సులు తప్పనిసరి చేయడమే కాకుండా, నివాస ప్రాంతాల్లో ఈ వన్యజంతువులను ఉంచడం నిషేధించింది.

Read More : అమెరికా టెక్సాస్‌ను ముంచెత్తిన వరదలు

One thought on “పాకిస్థాన్‌లో పెంపుడు సింహం దాడి

Comments are closed.