హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న ఏఐజీ (AIG) ఆసుపత్రిలో నూతన విభాగాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బుధవారం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ఆరోగ్యరంగంపై నూతన దిశను సూచించాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న వైద్యులు తమ సామాజిక బాధ్యతగా ప్రతీ ఏడాది కనీసం నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు వైద్య సేవలు అందించాలంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
వైద్య వృత్తిలో ఆత్మ సంతృప్తి సాధించాలంటే ప్రజలతో నేరుగా మమేకం కావాలన్న భావనను ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కార్పొరేట్ స్థాయిలో సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. “ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ప్రాణాలు పోతాయనే అపోహను తొలగించడమే మా లక్ష్యం” అని సీఎం అన్నారు.
ఉస్మానియా, నిమ్స్, ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు
ఉస్మానియా ఆసుపత్రికి రూ. 3 వేల కోట్ల వ్యయంతో 30 ఎకరాల్లో ఆధునిక భవనం నిర్మిస్తున్నామని తెలిపారు. అదే విధంగా నిమ్స్‌లో 2,000 పడకల విభాగాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. వరంగల్, అల్వాల్, ఎల్‌బీ నగర్, సనత్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులతో కలిసి వచ్చే డిసెంబర్ 9 నాటికి కొత్తగా 7,000 పడకల సామర్థ్యం అందుబాటులోకి రానుందని వెల్లడించారు.
విదేశాల్లో స్థిరపడిన వైద్యులకు వేదిక ఏర్పాటుపై దృష్టి
అమెరికాలో లేదా ఇతర దేశాల్లో స్థిరపడిన తెలుగు వైద్యులు తమ సేవలు అందించాలనుకున్నా, ఇందుకు సరైన వేదిక లేకపోవడం సమస్యగా ఉన్నదని సీఎం అన్నారు. అందుకోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ వేదిక ద్వారా కార్పొరేట్ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రులతో అనుసంధానమై పేదలకు సేవలు అందించే అవకాశం కలుగుతుందని వివరించారు.
ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్ కింద భారీ ఖర్చులు
ప్రజలపై వైద్య భారం తగ్గించేందుకు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి (C.M.R.F) ద్వారా ఇప్పటివరకు రూ. 1,400 కోట్లు పేదల వైద్యంపై ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఆరోగ్య రంగానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 11,500 కోట్లు కేటాయించామని చెప్పారు.
మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
తెలంగాణలో కోటి మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆరోగ్య ప్రొఫైల్స్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్యాన్సర్ నివారణలో భాగంగా వారికి ప్రత్యేక హెల్త్ కార్డులు, ఐడీ నంబర్లు జారీ చేయనున్నట్లు వివరించారు. క్యాన్సర్ చికిత్సలో నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని సలహాదారుగా నియమించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఏఐజీ సేవలపై ప్రశంసలు
AIG ఆసుపత్రి సేవలను సీఎం ప్రశంసించారు. ప్రపంచంలోని 65 దేశాల నుంచి రోగులు చికిత్స కోసం వస్తుండటాన్ని గర్వంగా పేర్కొన్నారు. జపాన్‌లో మన నర్సులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా, వారికి జపనీస్ భాషలో శిక్షణ కల్పించాలని నిర్ణయించామని తెలిపారు.
సమగ్ర ఆరోగ్య రంగాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజల ఆరోగ్య భద్రతకు గట్టి బలంగా నిలుస్తాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Read More : మహా న్యూస్ వివరణ: “వ్యూస్ కోసం Thumb Nails..

One thought on “కార్పొరేట్ వైద్యులకు సీఎం రేవంత్ పిలుపు”
Comments are closed.