మంజీరా నిర్లక్ష్యం: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం

జూరాల ప్రాజెక్టులో జరిగిన ఘటనపై చర్చ ఇంకా తేలిపోకముందే… ఇప్పుడు మంజీరా బ్యారేజీ సమస్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలను తీర్చే ఈ కీలక ప్రాజెక్టును కూడా ప్రమాదంలోకి నెట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. కేటీఆర్ మాట్లాడుతూ, సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఇది చేతకానితనమే కాకుండా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని వ్యాఖ్యానించారు.

మార్చి 22న స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (SDSO) మంజీరా బ్యారేజీని పరిశీలించి, భద్రతా లోపాలపై నివేదిక ఇచ్చిందని, కానీ ఆ నివేదికను ప్రభుత్వం పట్టించుకోలేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వరద ఒత్తిడికి పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని, స్పిల్‌వే దెబ్బతిన్నదని SDSO హెచ్చరించినా… సీఎం మాత్రం మొద్దునిద్ర తీయలేదని విమర్శించారు.
ఇప్పటికే మేడిగడ్డ వద్ద NDMA నివేదికను పట్టించుకోకపోయిన ప్రభుత్వానికి, మంజీరా గురించి SDSO హెచ్చరికలైనా తలికిందులే అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మేడిగడ్డలో చిన్నపాటి పగుళ్లపైనే పెద్ద చర్చలు చేసిన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇప్పుడు మంజీరా సమస్యపై మౌనం వహించడం వారి రాజకీయ దురుద్దేశాలను చూపుతోందని మండిపడ్డారు.

ఎగువ నుంచి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో మంజీరా బ్యారేజీ మరింత ప్రమాదంలో పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయం మానేసి మేడిగడ్డ, మంజీరా బ్యారేజీలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదని హెచ్చరించారు. తన ప్రకటన చివర్లో “జై తెలంగాణ” అంటూ ముగించారు.

Read More : దుబ్బాక ఉపఎన్నికలోనే ఫోన్ ట్యాపింగ్ మొదలైంది