కేసీఆర్‌కు రెండో రోజు వైద్య పరీక్షలు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) ఆరోగ్య పరీక్షల నిమిత్తం శనివారం మరోసారి గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG) ఆసుపత్రిని సందర్శించారు. ఇది వరుసగా రెండో రోజు ఆయన ఆసుపత్రికి వెళ్లడం గమనార్హం.

ఇప్పటికే శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు కూడా కేసీఆర్ ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రికి చేరుకున్నారు. దాదాపు ఒక గంటపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండిన ఆయనకు నిపుణులు పూర్తిస్థాయి ఆరోగ్య తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్, ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరెడ్డి నేతృత్వంలో వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనకు పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు వెల్లడించారు. అయితే భవిష్యత్తులో ఆరోగ్య పరిరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.

Read More : తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్‌కు 3 కోట్ల ఆర్థిక సహాయం