వీవీఆర్ కృష్ణంరాజు జ్యుడీషియల్ రిమాండ్

అమరావతి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జర్నలిస్ట్ వీవీఆర్ కృష్ణంరాజు జ్యుడీషియల్ కస్టడీకి రాగా, ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అమరావతిని అవమానించేలా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు కావడంతో కృష్ణంరాజును అరెస్టు చేసిన పోలీసులు ఆయనను మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ నెల 26వ తేదీ వరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కృష్ణంరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

ఈ నెల 6వ తేదీన సాక్షి టీవీలో ప్రసారమైన ‘కేఎస్ఆర్ లైవ్ షో’లో కృష్ణంరాజు పాల్గొని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అమరావతిని “వేశ్యల రాజధాని”గా అభివర్ణించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మహిళా సంఘాలు, సామాజిక సంస్థలు, పౌరసంఘాలు పెద్దఎత్తున ఆందోళనలకు దిగాయి.

దీనికి సంబంధించి అమరావతి జేఏసీ దళిత నాయకురాలు కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో వీవీఆర్ కృష్ణంరాజును ప్రధాన నిందితుడిగా (ఏ1) పేర్కొన్నారు. ఇదే కేసులో రెండో నిందితుడిగా (ఏ2) ఉన్న సాక్షి టీవీ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పటికే అరెస్ట్ అయి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

ఈ వ్యవహారం మీడియా, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వీవీఆర్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుల అరెస్టులతో కేసు మరింత మలుపులు తిరిగే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

One thought on “వీవీఆర్ కృష్ణంరాజు జ్యుడీషియల్ రిమాండ్

Comments are closed.