సుప్రీం కోర్టు పేరుతో భారీ మోసం: నకిలీ జడ్జితో వీడియో కాల్

హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్‌కి పెద్ద మోసం ఎదురైంది. సుప్రీం కోర్టు జడ్జీ పేరుతో నకిలీ కోర్టు ఏర్పాటుచేసిన సైబర్ నేరగాళ్లు, వీడియో కాల్‌లో నకిలీ జడ్జిని చూపించి అతని నుండి ఏకంగా రూ.1.5 కోట్లు వసూలు చేశారు.

ఈ మోసానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మోసగాళ్లు ముందుగా బాధిత ఇంజనీర్‌కి “మీ పేరు ఒక కేసులో వచ్చిందని, ఈ కేసు సుప్రీం కోర్టులో ఉంది” అంటూ సందేశం పంపారు. అనంతరం జడ్జీ నుంచి వీడియో కాల్ వస్తుందని, మర్యాదగా మాట్లాడాలంటూ సూచించారు.

అల్పకాలంలోనే నకిలీ జడ్జీతో వీడియో కాల్‌కి కనెక్ట్ చేసిన నేరగాళ్లు, కేసు తీవ్రమై ఉండటంతో అరెస్ట్ కూడా కావొచ్చని బెదిరించారు. ఈ కేసును కొలుసులు లేకుండా ముగించాలంటే సుప్రీం కోర్టు ఖాతాలో డబ్బులు జమ చేయాలనీ, కేసు ముగిసిన తర్వాత ఆ మొత్తం తిరిగి అకౌంట్‌లో జమ అవుతుందని నమ్మించారు.

ఈ మాటలకి బలైన రిటైర్డ్ ఇంజనీర్, వరుసగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ మొత్తం రూ.1 కోటి 50 లక్షలు మోసగాళ్ల అకౌంట్లలో జమ చేశాడు. అయితే, చాలా రోజులు గడిచినా డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం ఈ కేసు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ కోర్టు వీడియో, కాల్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా నిందితుల జాడ తెలుసుకునే పనిలో ఉన్నారు.
ఈ ఘటనపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌కు స్పందించకుండా పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

Read More : మినిస్టర్ పై వేసిన పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

One thought on “సుప్రీం కోర్టు పేరుతో భారీ మోసం: నకిలీ జడ్జితో వీడియో కాల్

Comments are closed.