ప్రధాని మోదీపై సీఎం తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుతోనే మోదీ పాకిస్థాన్‌పై యుద్ధాన్ని విరమించుకున్నారని వ్యాఖ్యానించారు.

“మోదీకి వీరతిలకం దిద్ది పంపితే యుద్ధం చేయకుండా వెనక్కి తగ్గిపోయారు. 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టారు,” అని ఆయన అన్నారు. బీజేపీ నేతలు తిరంగా ర్యాలీలు ఎందుకు నిర్వహిస్తున్నారో వారు తాను ముందుగా ఆలోచించుకోవాలని సూచించారు.

రాష్ట్ర భద్రతపై బీజేపీకి ఏ మాత్రం పట్టింపు లేదని, పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునే శక్తి ఆ పార్టీలో లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. “అసలైన దేశ భక్తి ఎలా ఉంటుందో కాంగ్రెస్ చరిత్ర చెబుతుంది. కానీ బీజేపీ నేతలు మేం దేశానికి ఏం చేశామో మర్చిపోతున్నారు,” అని అన్నారు.

ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ, “మోదీ ఇప్పుడు రద్దయిన వెయ్యి రూపాయల నోటు లాంటోడు” అని ఎద్దేవా చేశారు. దేశానికి రాహుల్ గాంధీ లాంటి నిజాయితీ గల నాయకుడు అవసరమని పేర్కొన్నారు. “రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఈ వేదికపై ప్రతిజ్ఞ చేద్దాం. దేశానికి త్యాగశీల నాయకత్వం అవసరం. సొంత ఇల్లు లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ,” అని కొనియాడారు.

కాంగ్రెస్ పార్టీనే దేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన పార్టీగా పేర్కొంటూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని రేవంత్ గుర్తు చేశారు. “ఇది త్యాగాల పుంజం అయిన కాంగ్రెస్ పార్టీని గౌరవించాల్సిన సమయం,” అని ఆయన స్పష్టంగా తెలిపారు.

Read More : అమెరికాతో చర్చల్లో టారిఫ్ ప్రస్తావన లేదు: భారత్‌ స్పష్టత.