హైదరాబాద్ మెట్రో టికెట్ ఛార్జీల్లో సవరణ

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు సంబంధించిన తాజా పరిణామంలో, ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు సంస్థ శనివారం (మే 24) నుంచి సవరించిన టికెట్ చార్జీలను అమలులోకి తీసుకురానుంది. ఇప్పటికే పెంచిన ధరలపై ప్రయాణికుల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, సంస్థ 10 శాతం తగ్గింపు ప్రకటించింది.

ప్రయాణికులకు తాత్కాలిక ఊరట

ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (FFC) సిఫారసుల మేరకు, సంస్థ మొదట కనిష్టంగా ₹2 నుంచి గరిష్ఠంగా ₹16 వరకు టికెట్ల ధరలు పెంచినట్లు ప్రకటించింది. ఈ రేట్లు మే 17 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, తీవ్ర విమర్శల నేపథ్యంలో మే 24 నుంచి అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అందులో భాగంగా, తాజా ప్రకటనలో 10 శాతం తగ్గింపు అమలవుతుందనీ, ప్రయాణికులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

తగ్గింపు అంటే నిజంగా తగ్గించడమేనా?

ఎల్అండ్‌టీ తెలిపిన ఈ 10 శాతం రాయితీ వాస్తవానికి పూర్తిగా ప్రయాణికులకు లాభం చేకూర్చుతోందా అనే సందేహం వ్యక్తమవుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సంస్థ ప్రకటించిన తగ్గింపు వాస్తవానికి కేవలం 7 శాతమే. టికెట్ కొనుగోలు సమయంలో చిల్లర సమస్యను సాకుగా చూపుతూ, సంస్థ టికెట్ ధరలను రౌండప్ చేస్తోంది. దీనివల్ల ప్రయాణికులపై కొన్ని రూపాయల అదనపు భారమయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుత టికెట్ ధరలు ఇలా

తాజాగా విడుదలైన సవరించిన రేట్ల ప్రకారం కనిష్ట ఛార్జీ ₹11 కాగా, గరిష్ఠ ఛార్జీ ₹69గా నిర్ణయించారు. ఈ స్లాబులు QR కోడ్, టోకెన్లు, డిజిటల్ చెల్లింపులు, స్మార్ట్ కార్డులు వంటి అన్ని మార్గాలపై వర్తిస్తాయని సంస్థ స్పష్టం చేసింది.

ప్రయాణికుల ఆందోళనలు కొనసాగేనా?

ఈ విధంగా రాయితీ పేరిట ప్రయాణికులపై మరోసారి భారమేసినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవ తగ్గింపు పూర్తిగా అమలవుతుందా? లేక ఇది తాత్కాలిక ఊరట మాత్రమేనా? అన్న ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.

ప్రభుత్వం దీనిపై స్పందిస్తుందా లేక ప్రయాణికులే మరోసారి రోడ్డెక్కాలా అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read More : బీఆర్ఎస్ లో అంతర్గత విషయాలు పబ్లిక్ గా చర్చించకూడదు – KTR