తమిళనాడులోని ప్రభుత్వ మద్యం సంస్థ టాస్మాక్‌పై ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహించిన దాడులపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈడీ హద్దులు మించి వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించిన ధర్మాసనం, సమాఖ్య పాలనకు ఇది విరుద్ధమని పేర్కొంటూ, తదుపరి చర్యలన్నింటినీ తక్షణమే నిలిపివేయాలని గురువారం ఆదేశించింది. వేసవి సెలవుల తర్వాతే విచారణ కొనసాగిస్తామని వెల్లడించింది.
ఈడీ మార్చి నెలలో, అలాగే గత వారం టాస్మాక్ కార్యాలయాలు, బార్ లైసెన్సులు, మద్యం రవాణా, బాటిల్ తయారీ సంస్థలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల సందర్భంగా అనేక మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, వాటి డేటాను క్లోన్ చేశారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, కార్పొరేట్ సంస్థలపై ఈడీ ఎలా కేసులు నమోదు చేస్తుందంటూ ప్రశ్నించింది.
ఈడీ చర్యలకు అనుమతించిన మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 23నిచ్చిన ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం, టాస్మాక్ కలిసి సుప్రీం కోర్టులో సవాలు చేయగా, కోర్టు తాత్కాలికంగా ఈడీ చర్యలకు బ్రేక్ వేసింది. ఈ తీర్పును డీఎంకే స్వాగతించింది. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీం ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డీఎంకే నేత ఆర్ఎస్ భారతి మాట్లాడుతూ, ఇది బీజేపీ కుట్రలకు గట్టి దెబ్బగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Read More : అరుణాచల్ ప్రదేశ్‌లో హైటెక్ కాపీయింగ్ ముఠా హల్చల్…
