పెళ్లి పేరుతో ఒంటరి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని, ప్రేమాట్లతో నమ్మబలికి వారి సంపదను గుంజుతున్న ఓ మహిళల ముఠా నిర్వాకం బయటపడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, నగదు, బంగారం, ఇతర ఖర్చుల పేరిట లక్షల రూపాయలు వసూలు చేసి అనంతరం కనిపించకుండా పోవడం ఈ ముఠా ప్రధాన వ్యూహంగా మారింది.
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా తిరువూరు ప్రాంతానికి చెందిన తాయారమ్మ అలియాస్ సరస్వతి, తెలంగాణ ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతానికి చెందిన స్వాతి కలిసి హైదరాబాద్లో ఓ పెళ్లిళ్ల మోసపు ముఠాను నడుపుతున్నట్టు సమాచారం. వీరిలో ఒకరిని పెళ్లి కోరిక కలిగిన విధవురాలిగా చూపిస్తూ మ్యారేజ్ బ్యూరోలలో ప్రకటనలు ఇస్తున్నారు. “వయసుతో పని లేదు, భర్త లేడు, బాగా చూసుకుంటే చాలు” అనే మాయమాటలతో ప్రకటనల ద్వారా ఒంటరి వృద్ధులని వల వేసి Hyderabadకు రప్పించేవారు.
ఈ ప్రక్రియలో వారు నమ్మిన వృద్ధుల దగ్గర బంగారం కొనుగోలు, చీరలు, వివాహ మండపం ఖర్చులు, బోజన ఏర్పాట్లు అనే హేతువులతో లక్షల రూపాయలు వసూలు చేశారు. బాగానే సాగుతున్నట్లు అనిపించిన ఈ వ్యవహారం, వివాహంపై స్పష్టత కోరిన బాధితులకు ఎదురుదెబ్బలుగా మారింది. పెళ్లిపై మరింత వివరాలు అడిగితే, “వేధింపులు చేస్తున్నారు” అంటూ కేసులు పెడతామంటూ వారిని బెదిరించడం ప్రారంభించారు.
ఇంతవరకూ దాదాపు 100 మందికి పైగా వృద్ధులు ఈ మోసపూరిత పెళ్లి వ్యవహారానికి బలయ్యారని పోలీసుల ప్రాథమిక అంచనా. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సరస్వతి భర్త ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి హోదాలో ఉన్నారు. అయితే, కొంతకాలం క్రితమే ఆయన సస్పెండ్ అయ్యారు. మరో నిందితురాలు స్వాతికి భర్త ఉన్నప్పటికీ, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్లో ఉంటూ మోసాలకు పాల్పడుతోంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. బాధితులు అధిక సంఖ్యలో ఉండటంతో కేసు మరింతగా విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు. వృద్ధుల సహాయంగా నిలిచి, నిరభ్యంతరంగా జీవించేందుకు పెళ్లి పేరుతో మోసాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
ఇలాంటి మోసపూరిత చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి వ్యక్తుల చెరలో చిక్కుకోకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
Read More : ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

2 thoughts on “ఒంటరి వృద్ధులపై పెళ్లిళ్ల పేరిట మోసం”
Comments are closed.