కన్నడను నిరాకరించిన SBI మేనేజర్‌పై కలకలం

బెంగళూరులోని సూర్యనగర ప్రాంతంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్‌లో చోటు చేసుకున్న ఓ సంఘటన కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళా మేనేజర్ స్థానిక కస్టమర్‌తో త‌న పని విషయమై సంభాషణ జరిపే క్రమంలో, తాను కన్నడ మాట్లాడనని, హిందీలోనే మాట్లాడతానని పేర్కొనడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

కన్నడ రాష్ట్ర భాషగా ఉన్నప్పటికీ, ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో పనిచేస్తున్న అధికారి ఇలా మాట్లాడడం పట్ల స్థానికులు తీవ్రంగా స్పందించారు. సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అది రాష్ట్ర రాజకీయాలను కూడా కుదిపేసింది.

ఈ వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ, కస్టమర్లతో మాట్లాడేటప్పుడు స్థానిక భాష అయిన కన్నడకు గౌరవం ఇవ్వడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని అన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించకపోవడం సరికాదని, ఉద్యోగులు స్థానిక భాషలో మాట్లాడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

ప్రతి ఉద్యోగి పని చేస్తున్న రాష్ట్ర సంస్కృతిని, భాషను గౌరవించాల్సిన బాధ్యత కలిగి ఉండాలన్నారు. కర్ణాటకలో పనిచేసే ఉద్యోగులు కనీసం ప్రాథమిక స్థాయిలో అయినా కన్నడ నేర్చుకోవాలని సీఎం సూచించారు. ఇది అధికారిక ఆదేశంగా కాకపోయినా, ప్రజలతో సరైన కమ్యూనికేషన్‌కి అది ఎంతో అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు.

కన్నడపై నిరాకరణ చూపిన బ్యాంక్ మేనేజర్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం ఈ ఘటనపై ఏ విధంగా స్పందించబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ ఘటనతో స్థానిక భాషా గౌరవం, ప్రాంతీయ సంస్కృతి ప్రాధాన్యత వంటి అంశాలు మరోసారి ముందుకు వచ్చాయి. ఉద్యోగులు తమ విధుల్లో భాషా గౌరవాన్ని పాటించాలన్న అభిప్రాయం బలపడుతోంది.

Read More : గుజరాత్‌లో ఆసియాటిక్ సింహాల సంఖ్యలో విశేష వృద్ధి.

One thought on “కన్నడను నిరాకరించిన SBI మేనేజర్‌పై కలకలం

Comments are closed.