అల్లు అర్జున్‌పై అమితాబ్ ప్రశంసలు
ఇంటర్నెట్ డెస్క్: అల్లు అర్జున్ (Allu Arjun) నటనను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తెగ ప్రశంసించారు. బన్నీ పనితీరుకు తాను పెద్ద అభిమాని అని అమితాబ్ వెల్లడించారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన “పుష్ప: ది రూల్” (Pushpa 2) సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్లలో అల్లు అర్జున్ వివిధ నగరాల్లో సందడి చేసిన సంగతి తెలిసిందే.
ముంబైలో ఒక మీడియా ఇంటర్వ్యూలో బన్నీ మాట్లాడుతూ, అమితాబ్ అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అమితాబ్ ఒక స్టార్‌గా నిలిచారని, ఆయన ఎంతోమందికి స్ఫూర్తిగా ఉన్నారని చెప్పారు. అమితాబ్ సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని బన్నీ వెల్లడించారు.
తాజాగా, బన్నీ మాట్లాడిన వీడియోను అమితాబ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా, “కృతజ్ఞతలు అల్లు అర్జున్. మీరు నా అర్హతకు మించి ప్రశంసించారు. నిజం చెప్పాలంటే, నేను మీ ప్రతిభకు పెద్ద అభిమాని. మీరు ఇలాగే ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ ఉండాలి. ఇలాంటి హిట్లు ఇంకా పొందాలని కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు,” అని అమితాబ్ పేర్కొన్నారు.
ఈ పోస్టుకు అల్లు అర్జున్ స్పందిస్తూ, “మీరు మా సూపర్ హీరో. మీలాంటి మహానటుడి నుంచి ఇలాంటి ప్రశంసలు అందుకోవడం నమ్మలేకపోతున్నా. నాపై మీకున్న ప్రేమకు ధన్యవాదాలు,” అని రిప్లై ఇచ్చారు.
