వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో వంశీ బెయిల్ కోరుతూ పిల్ దాఖలు చేశాడు. పిటిషన్ను కోర్టు స్వీకరించి, విచారణను వచ్చే సోమవారం నిర్వహించనుంది. అదే సమయంలో, వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారని కోర్టు గుర్తించి, అతన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాలని పోలీస్ అధికారులకు ఆదేశించింది. శనివారం వంశీని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గన్నవరం నియోజకవర్గంలో పోటీ చేసిన వంశీపై ఆ ఏడాది అక్టోబర్లో కొయ్యూరు, పెరికీడు గ్రామాల్లో కొందరికి నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేసినట్లు 9 మందిపై కేసు నమోదు చేయబడింది. అయితే ఆ కేసులో వంశీ పేరు మొదటిసారి ఉండలేదు. 2024లో టీడీపీ ఎంపీ యార్లగడ్డ వెంకట్రావు ఫిర్యాదు మేరకు ఈ కేసు వేగవంతమైంది. తరువాత అధికార రెవెన్యూ అధికారులు తమ నివేదికలో వంశీ ఇచ్చిన పట్టాలు నకిలీ ముద్రలతో ఉన్నట్లు పేర్కొనడంతో, వంశీని పదో నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. శుక్రవారం పోలీసులు వంశీని నూజివీడు 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రావణి ఎదుట హాజరు చేశారు.
వంశీతో పాటు ఆయన అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగారావుకి కూడా 14 రోజుల రిమాండ్ ఇచ్చారు. వంశీ కోర్టుకు హాజరైనప్పటి నుంచి తీవ్రమైన దగ్గు సమస్యతో బాధపడుతున్నాడు. కోర్టు వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వైద్యం అందించాలని ఆదేశించింది. వంశీ భార్య పంకజశ్రీ మాట్లాడుతూ, ఆయన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపారు.
ఇక గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి విజయవాడ 12వ అదనపు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ, నూజివీడు కోర్టు రిమాండ్ కారణంగా వంశీ జైల్లోనే ఉండాల్సి ఉంది.
తాజాగా, వైసీపీ హయాంలో వంశీపై అక్రమ మైనింగ్ కేసు కూడా నమోదైంది. గన్నవరం, బాపులపాడు మండలాల్లో అక్రమంగా మైనింగ్ చేయడంలో వంశీ, ఓలుపల్లి మోహన్ రంగారావు కీలకులుగా వ్యవహరించారని కృష్ణా జిల్లా భూగర్భ గనుల శాఖ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో వంశీ సహా 13 మందిని నిందితులుగా చేర్చారు. ఫిర్యాదులో వంశీ అక్రమంగా రూ.192 కోట్ల వరకూ సంపాదించాడని పేర్కొన్నారు.
Read More : BJP : విజయవాడలో తిరంగా యాత్ర

One thought on “నూజివీడు కోర్టు విచారణ సోమవారం”
Comments are closed.