ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ మార్పుపై వివాదం

భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కొద్ది రోజుల పాటు నిలిచిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) మళ్లీ మే 17 నుంచి ప్రారంభం కానుంది. మిగిలిన 17 మ్యాచ్‌లు, ప్లేఆఫ్‌లు సహా, జూన్ 3 వరకు జరుగనున్నాయి. ఇందులో రెండు డబుల్‌హెడర్లు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు టోర్నమెంట్ కీలక దశకు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. లీగ్ నిలిపివేయబడిన సమయంలో చాలా మంది విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు వెళ్లిపోయారు. కానీ టోర్నమెంట్ తిరిగి ప్రారంభమయ్యే సమయానికి కొందరు మాత్రమే తిరిగి జట్టులో చేరారు. మిగిలిన వారు, కొన్ని కారణాలతో టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో, ఢిల్లీ క్యాపిటల్స్ యువ బ్యాటర్ జాక్ ఫ్రేజర్-మెగుర్క్ మిగిలిన మ్యాచ్‌ల నుంచి నిష్క్రమించినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. 11 మ్యాచ్‌లలో 13 పాయింట్లు సంపాదించింది.

ఈ పరిణామాల్లో బీసీసీఐ జట్లకు తాత్కాలికంగా విదేశీ ఆటగాళ్లకు ప్రత్యామ్నాయులను తీసుకునే అనుమతిని ఇచ్చింది. అయితే, ఈ తాత్కాలిక ఆటగాళ్లను వచ్చే సీజన్‌లో నిలుపుకోవడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జాక్ ఫ్రేజర్-మెగుర్క్ స్థానంలో ఎంపిక చేసింది. అయితే, ఈ నిర్ణయం సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలకు గురైంది. ఆటగాడి నైపుణ్యాన్ని కాకుండా, అతని జాతీయతపై సోషల్ మీడియా వేదికగా కొన్ని గ్రూపులు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

కొంతమంది నెటిజన్లు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొంటూ, అటువంటి దేశానికి చెందిన ఆటగాడిని తీసుకోవడం దేశద్రోహం అంటూ విమర్శించారు. “ఢిల్లీ క్యాపిటల్స్‌పై బహిష్కరణ విధించాలి”, “దేశ వ్యతిరేక ఫ్రాంఛైజీకి మద్దతివ్వను” అంటూ పోస్టులు వైరల్ అయ్యాయి.

ఈ వివాదం ప్రస్తుతానికి సోషల్ మీడియాలోనే పరిమితమై ఉన్నప్పటికీ, ఇది బీసీసీఐ, ఐపీఎల్ బ్రాండ్ ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. మరోవైపు, ఢిల్లీ జట్టు తుది నాలుగులోకి చేరాలంటే వచ్చే మ్యాచ్‌లు గెలవడం కీలకం.

Read More : కరుణ్ నాయర్‌ : అనిల్ కుంబ్లే సూచన

One thought on “ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ మార్పుపై వివాదం

Comments are closed.