తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం జలసౌధలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు ప్రాజెక్టుల పురోగతిపై నివేదికలు సమర్పించారు. అయితే, మహబూబ్‌నగర్ జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ రమణారెడ్డిపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో సేవలందించిన రమణారెడ్డిని ఉద్దేశించి, అదే విధంగా పనులు చేస్తే చర్యలు తప్పవని సీఎం గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.
ఎత్తిపోతల పథకాలపై కీలక ఆదేశాలు
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూసేకరణ, పునరావాస సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారమైన తర్వాతే పైపుల బిల్లులు సమర్పించాలని సీఎం స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కళేశ్వరం అక్రమాలపై మరోసారి స్పష్టం
కళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై కేసులు నమోదైన నేపథ్యంలో సీఎం రేవంత్, వాటిలో బాధ్యత వహించిన అధికారులపై చర్యలు తప్పవని తెలిపారు. అయితే ఈ కేసులతో సంబంధం లేని అధికారులు భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, తప్పులు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వేతనాలు, నిధుల కేటాయింపులపై హామీలు
కాంట్రాక్ట్ సిబ్బంది నియామకం విషయంలో ప్రభుత్వం ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసిందని, ప్రతిపాదనలు వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. ప్రాజెక్టుల నిర్వహణ ఖర్చులకు నెలకు రూ.75 కోట్లు, పెండింగ్ బిల్లులకు రూ.50 కోట్లు, శిక్షణ సంస్థ వాలంతరికి రూ.10 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టుకు ఎన్జీటీ ఆదేశాల ప్రకారం పనులకు రూ.10 కోట్లు, దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తి కోసం రూ.2 వేల కోట్లు అవసరమని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సమీక్షలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం, త్వరలో ప్రభుత్వం తదుపరి కార్యాచరణ ప్రకటించనుంది.
Read More : అఫ్జల్‌గంజ్‌లో అగ్నిప్రమాదం

One thought on “నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష.”
Comments are closed.