పాక్ ప్రకటన కలకలం.

మే 7న పాక్‌లోని బహావల్‌పూర్ ప్రాంతంలో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టింది. ఈ దాడుల్లో మసూద్ అజార్‌ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మరదలు, ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మసూద్ అజార్ ఫ్యామిలీలో ప్రస్తుతానికి ఒక్క అతనే జీవించి ఉన్నాడని సమాచారం.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ సంచలన ప్రకటన చేశారు. భారత దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారంగా ఒక్కొక్కరికి కోటి రూపాయలు చెల్లించనున్నట్టు తెలిపారు. పీఎంవో విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, మసూద్ అజార్ కుటుంబానికి రూ.14 కోట్ల నష్టపరిహారం అందే అవకాశం కనిపిస్తోంది.

అయితే, భారత్ చేసిన విమాన దాడులు పాక్ లోపలికి చొచ్చుకుపోయి ఉగ్ర స్థావరాలపై నేరుగా జరిగిన ప్రహారంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బహావల్‌పూర్‌లో జైషే మహమ్మద్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉండే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో ఉగ్రవాద నెట్‌వర్క్‌కు భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.

ఈ పరిణామాలతో పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాద కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్ర సంస్థల నేతలకు ప్రభుత్వం నేరుగా ఆదుకోవడమేనంటూ అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

భారత రక్షణ శాఖ ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రవాదానికి గట్టి బుద్ధి చెప్పినప్పటికీ… పాకిస్థాన్ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Read More : భారత్-పాక్‌ల : ట్రంప్ కీలక వ్యాఖ్యలు