ఆంధ్రప్రదేశ్లోని మద్యం కుంభకోణం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా గుర్తించిన భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీను సిట్ (SIT) అధికారులు కర్ణాటక రాష్ట్రం మైసూరులో అరెస్టు చేశారు. ఆయనను మైసూరు కోర్టులో హాజరు పరచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకునే ప్రయత్నాల్లో సిట్ బృందం ఉంది.
మూడు రోజుల క్రితం సిట్ అధికారులు బాలాజీతో పాటు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డిలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నోటీసుల ప్రకారం వారు విజయవాడ సిట్ కార్యాలయానికి హాజరుకాలేదు. అంతేకాకుండా, హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు తిరస్కరించబడ్డాయి. తాజాగా సుప్రీంకోర్టు కూడా అరెస్ట్ నుండి మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. మంగళవారం సుప్రీంకోర్టులో గోవిందప్ప బాలాజీ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది.
ముగ్గురు కీలక నిందితులుగా నమోదు
ఈ కేసులో ధనుంజయ రెడ్డిని A31, కృష్ణమోహన్ రెడ్డిని A32, గోవిందప్ప బాలాజీని A33గా సిట్ అధికారులు గుర్తించారు. ఇటీవల అరెస్టయిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ నివేదికల్లో కూడా ఈ ముగ్గురి పేర్లు ప్రస్తావించబడ్డాయి. మద్యం సరఫరా సంస్థల నుంచి ముడుపులు వసూలు చేయడంలో వీరి పాత్ర కీలకమని ఆ నివేదికలు పేర్కొంటున్నాయి.
సీఎం జగన్కు సన్నిహితులుగా
ఈ ముగ్గురు నిందితులు వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితులుగా ఉన్నట్టు పేర్కొనబడింది. మద్యం డిస్టిలరీలు, సరఫరా సంస్థల యజమానులతో ఈ ముగ్గురూ తరచూ సమావేశమయ్యేవారని సిట్ అధికారుల తేల్చారు. ముడుపుల వసూళ్లకు సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చిన వారిగా వీరు గుర్తింపు పొందారు. ఈ మొత్తం ముడుపులు అనంతరం డొల్ల కంపెనీలకు మళ్లించబడ్డట్టు ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ కేసు చుట్టూ కీలక రాజకీయ నేతల సంబంధాలు వెలుగులోకి వస్తుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది.
Read More : ఎన్టీఆర్ జిల్లాలో విషాదం
