హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్-2025 అంతర్జాతీయ సుందరీ పోటీల నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి.
మిస్ వరల్డ్ పోటీదారులు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్‌లో పాల్గొననుండగా, అనంతరం చౌమొహల్లా ప్యాలెస్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు భద్రత చర్యలను పెంచడంతో పాటు ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. చార్మినార్ పరిసరాల్లోని షాపులు కూడా పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు.
ట్రాఫిక్ ఆంక్షల కారణంగా మదీనా సర్కిల్, చార్మినార్, శాలిబండ, వొల్గా జంక్షన్, ఖిల్వత్ రోడ్డులపై వాహనాలను పూర్తిగా నిలిపివేశారు. ఈ మార్గాల్లో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
అంతర్జాతీయ స్థాయి సుందరీ పోటీ కారణంగా హైదరాబాదులో రక్షణ ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు అధికారులు అన్ని విభాగాలను సమన్వయపరిచి ముందస్తు చర్యలు చేపట్టారు. పౌరులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read More : BRS ప్రభుత్వమే రాబోతున్నదని కేటీఆర్ స్పష్టం.
