టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. వారు అద్భుతమైన ప్రదర్శన కనబరిచినంత కాలం జట్టులో కొనసాగతారని, వారి రిటైర్మెంట్ పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమేనని వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో ఏబీపీ న్యూస్ నిర్వహించిన ‘ఇండియా ఎట్ 2047’ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు.
గంభీర్ ఏమన్నాడంటే…
“ఎవరెప్పుడు రిటైర్ అవ్వాలి అనేది కోచ్‌లు, సెలక్టర్లు నిర్ణయించలేరు. అది పూర్తిగా ఆటగాళ్ల నిర్ణయం. వారు నిలకడగా రాణిస్తే, 40 ఏళ్లకే కాదు, 45 ఏళ్ల వయసులోనూ ఆడవచ్చు. ప్రదర్శన ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు,” అని గంభీర్ స్పష్టం చేశారు.
కోచ్ పాత్రపై మాట్లాడుతూ… “ఎంపికలు సెలక్టర్ల పని. కోచ్ కేవలం తుది పదకొండిని నిర్ణయిస్తాడు. రాబోయే ఇంగ్లండ్ టెస్ట్ పర్యటనలో జట్టులో ఎవరు ఉంటారు అనేది సెలక్టర్ల పరిధిలోనే ఉంటుంది,” అని వివరించారు.
2027 వన్డే వరల్డ్‌కప్ గురించి…
2027లో దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్ వరకు రోహిత్, కోహ్లీ ఆడతారా అనే ప్రశ్నపై గంభీర్ స్పందిస్తూ, “ప్రదర్శన ఆధారంగానే వారి ఎంపిక జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో వారు చూపిన ఫామ్ అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియా టూర్‌లో విమర్శలు వచ్చినా, వారు క్లాస్ ఆటగాళ్లు,” అని తెలిపారు.
వీడ్కోలు మ్యాచ్‌లపై గంభీర్ అభిప్రాయం
“ఒక ఆటగాడు ఎప్పుడూ వీడ్కోలు కోసం క్రికెట్ ఆడడు. వారు దేశం కోసం అత్యుత్తమంగా ఆడిన సందర్భాలను గుర్తుపెట్టుకోవాలి. వీడ్కోలు మ్యాచ్‌లు అవసరం లేదనిపించినా, ప్రజల ప్రేమే వారికి నిజమైన గౌరవం. అదే వారి గొప్ప ట్రోఫీ,” అని గంభీర్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు.
ఈ వ్యాఖ్యలు సీనియర్ క్రికెటర్ల భవిష్యత్తుపై జరుగుతున్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్లుగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Read More : హిట్‌మ్యాన్ 11 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు

One thought on “టీమిండియా సీనియర్లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు.”
Comments are closed.