బీఆర్ఎస్‌ పాలన అప్పులు, అబద్ధాలమే!

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని వర్గాలకే ప్రయోజనం చేకూర్చి రాష్ట్రాన్ని భారీ అప్పుల్లో ముంచిందని మంత్రి సీతక్క ఆరోపించారు. కేసీఆర్ పాలన వల్ల నెలకు రూ.6,000 కోట్ల ప్రజాధనాన్ని అప్పుల చెల్లింపులకు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ‘‘కేసీఆర్‌కి నిజంగా సత్తా ఉంటే అసెంబ్లీకి వచ్చి తన స్థాయి చూపించాలి,’’ అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు.

బీఆర్ఎస్ నేతలు ఉద్యమాల పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించిన మంత్రి సీతక్క, ‘‘ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్నారు. ఆర్టీసీ కార్మికుల్లో 40 మందిని ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి నెట్టిన వారు బీఆర్ఎస్ నేతలే’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకుల ఇళ్లకు దాడులు చేసిన బాధ్యత కూడా గులాబీ నేతలదేనని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి అన్ని రంగాల్లో శూన్యమని, అప్పులు, అమ్మకాలే ప్రధానంగా చేసిన పనులైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బీఆర్ఎస్ అభివృద్ధి ఒక్క గాలిబుడగ మాత్రమేనని ప్రజలు ఎన్నికల్లో తేల్చిచెప్పారు,’’ అని మంత్రి స్పష్టం చేశారు.

ఇటీవల ఆర్థిక ఇబ్బందులు అధికమవుతున్నా.. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఆగకుండా కొనసాగుతున్నాయని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలకోసం ప్రభుత్వం నిజమైన పాలనను అందిస్తున్నదని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Read More : కేటీఆర్ ప్రెస్ మీట్: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు