AP : రాష్ట్రవ్యాప్తంగా వర్ష సూచనలు

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మరోసారి మారనున్నాయి. ద్రోణి ప్రభావం, వాతావరణ అనిశ్చితి కారణంగా మంగళవారం మరియు బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

ఇందులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. అలాగే గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశమూ ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇక తూర్పు, మధ్య, దక్షిణ జిల్లాలైన విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పు-పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.

ఇక మరికొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం కొనసాగుతోంది. నంద్యాల జిల్లా పసుపులలో 42.5 డిగ్రీలతో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు 42.4 డిగ్రీలు, పల్నాడు జిల్లా రావిపాడు 42.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలతో విరుచుకుపడ్డాయి. అయితే వర్షాలు కురిసే నేపధ్యంలో రానున్న రోజులలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే బయటకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Read More : ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు