శ్రీసిటీలో ఎల్జీ భారీ పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన దిశగా మరో కీలక ముందడుగు పడనుంది. అంతర్జాతీయ గృహోపకరణాల తయారీ దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో భారీ యూనిట్‌ను స్థాపించేందుకు సిద్ధమైంది. ఈ ప్లాంట్‌కు భూమిపూజ కార్యక్రమాన్ని మే 8న రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ నిర్వహించనున్నారు.

ఈ ప్రాజెక్టు మొత్తం రూ.5,001 కోట్ల పెట్టుబడితో ఆరేళ్లలో విడతల వారీగా అభివృద్ధి చేయనున్నారు. దాదాపు 2,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించే అవకాశముంది. ఈ యూనిట్‌లో ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు వంటి గృహోపకరణాల తయారీ జరుగుతుంది. ఉత్పత్తులకు అవసరమైన కీలక విడిభాగాలను రాష్ట్రంలోనే తయారు చేసేందుకు ప్రత్యేక యూనిట్లను కూడా ఏర్పాటుచేయనున్నారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో ఎల్జీ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ సమావేశమై, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని వివరించారు. ప్రభుత్వం అనుమతులు, ప్రోత్సాహకాలు మంజూరు చేయడంలో స్పీడుగా స్పందించింది. కేవలం ఐదు నెలల్లో అన్ని అనుమతులు మంజూరు చేయడం విశేషం.

ఇక, గత 11 నెలల్లోనే రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులకు, 5 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఎంఓయూలు కుదిరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆర్సెలర్ మిట్టల్, బీపీసీఎల్, టీసీఎస్, ఎన్టీపీసీ, రిలయన్స్ వంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి.

అంతర్జాతీయ వేదికలపై మంత్రి లోకేశ్ రాష్ట్ర పెట్టుబడి అవకాశాలను వివరించి, పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఏపీని పారిశ్రామిక రంగంలో ముందంజ వేయించేందుకు ప్రభుత్వం చురుకుగా అడుగులు వేస్తోంది.

Read More : AP : రాష్ట్రవ్యాప్తంగా వర్ష సూచనలు

One thought on “శ్రీసిటీలో ఎల్జీ భారీ పెట్టుబడి

Comments are closed.