తమిళ భాషకు మరింత ప్రాధాన్యం కల్పించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పిల్లలకు పేర్లు పెట్టడంలో, వ్యాపారాల నామకరణంలో తమిళ పదాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.
చెన్నైలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం స్టాలిన్ మాట్లాడుతూ – “తమిళులు తమిళనాడులో నివసిస్తున్నా, తమ పిల్లలకు ఉత్తరాది పేర్లు లేదా ఆంగ్ల పేర్లే పెడుతున్నారు. ఇది తగ్గించి, స్వచ్ఛమైన తమిళ పేర్లను వాడాలి” అని సూచించారు. వివాహ వేడుకల్లో పాల్గొన్నప్పుడు కొత్త దంపతులకు తమిళ పేర్లే పెట్టాలని స్వయంగా చెబుతానని తెలిపారు.
ఇదే విధంగా వ్యాపారస్తులకు కూడా స్టాలిన్ ఓ సందేశం ఇచ్చారు. “మీ దుకాణాలు మీ పిల్లలుగా భావిస్తే, వాటికి తమిళ పేర్లు పెట్టండి. ఒకవేళ ఆంగ్ల పదాలను వాడాల్సి వస్తే, వాటిని తమిళ లిపిలో రాయండి. ఈ విధంగా తమిళ భాషను ప్రజల జీవనశైలిలో భాగం చేయాలి” అని స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనలతో పోల్చబడ్డాయి. రామేశ్వరంలో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ – “తమిళ భాష పట్ల గర్వంగా ఉన్నట్లు చెబుతున్న నేతలు తమ లేఖలపై మాత్రం తమిళంలో సంతకం చేయడం లేదు” అని వ్యాఖ్యానించారు. ఆయన కూడా తమిళ భాషకు గౌరవం చూపాలంటే కనీసం పేరైనా తమిళంలో సంతకం చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో, స్టాలిన్ తాజా వ్యాఖ్యలు తమిళ భాష పరిరక్షణపై సాగుతున్న చర్చలకు కొత్త దిశ చూపుతున్నాయని భావిస్తున్నారు.
Read More : జమ్మూ కశ్మీర్ భద్రతపై పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

One thought on “ప్రజలకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి”
Comments are closed.