సింహాచలంలో దుర్ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి..

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద జరిగిన దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని చెప్పారు. ప్రమాదంలో గాయపడినవారిని విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఘటనాస్థలిలో హోంమంత్రి తానేటి అనిత సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు కలిసి సహాయక చర్యలు చేపడుతున్నాయని చెప్పారు.

ఈ దుర్ఘటనపై బీజేపీ ఏపీ రాష్ట్రాధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం కోసం క్యూలైన్‌లో ఉన్న ఏడుగురు భక్తులు మృతిచెందడం ఎంతో విషాదకరం అన్నారు. చందనోత్సవ సమయంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

Read More : జర్మనీలో క్యాన్సర్‌తో మృతి చెందిన రెహానా బేగం: గిద్దలూరు గ్రామంలో విషాదం