జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిపై అఖిలపక్ష సమావేశం

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి కేవలం కొన్ని పార్టీలనేకే ఆహ్వానం పంపాలన్న కేంద్ర ఆలోచనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, “పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న ప్రతి పార్టీకి సమావేశానికి ఆహ్వానం రావాలి. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం. రాజకీయ వ్యవహారంగా చూడరాదు” అని అన్నారు.

ఓవైసీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజుతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. “కేవలం 5–10 మంది లోక్ సభ సభ్యులు ఉన్న పార్టీలకే మాత్రమే ఆహ్వానం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. తక్కువ సభ్యులున్న పార్టీలను ఎందుకు పిలవడం లేదని నేను ప్రశ్నించాను. అందరిని పిలిస్తే సమావేశం ఎక్కువసేపు జరుగుతుందని మంత్రి సమాధానమిచ్చారు” అని ఆయన చెప్పారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా విమర్శించిన ఓవైసీ, “ఇది కేవలం బీజేపీ అంతర్గత సమావేశం కాదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఐక్యంగా నిలుస్తుందన్న సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలి. అందుకు అన్ని పార్టీలను ఆహ్వానించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది” అని అన్నారు.

“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనీసం ఒక గంట సమయం కేటాయించి అన్ని పార్టీల అభిప్రాయాలను వినాలి. మీ పార్టీకి కూడా లోక్ సభలో పూర్తి మెజారిటీ లేదు. అఖిలపక్ష సమావేశాన్ని పూర్తిగా సమర్థవంతంగా నిర్వహించాలి” అని ఒవైసీ పేర్కొన్నారు.

అంతేకాదు, ఉగ్రవాదంపై పోరాటంలో రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనబెట్టి, దేశం కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

Read More : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ : భారీ ఆపరేషన్

2 thoughts on “జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిపై అఖిలపక్ష సమావేశం

Comments are closed.