హైదరాబాద్‌లో రాజకీయ వేడి మరింత పెరిగింది. BRS నాయకుడు కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిపై భారీ ఆరోపణలు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) భూముల విషయంలో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని తాము గత వారం రోజుల క్రితమే వెల్లడించామని కేటీఆర్ అన్నారు.
సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ (CEC) ఈ విషయాన్ని తేల్చిచెప్పిందని, HCU భూముల్లో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నట్టు నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఈ కుంభకోణంపై స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని సీఈసీ సూచించిందని కేటీఆర్ వివరించారు.
కేటీఆర్ మరింత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ — ఈ కుంభకోణంపై ఆర్బీఐతో పాటు కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణకు ఆదేశించాలన్నారు. “రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంపై సరైన విచారణ జరిపితే నిజాలు బహిర్గతమవుతాయి” అని చెప్పారు.
ఈ సందర్భంగా గచ్చిబౌలి ప్రాంతంలోని HCU భూములకు చెందిన చెరువును కూడా తాకట్టు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కిందని కేటీఆర్ విమర్శించారు. “చెరువును తాకట్టు పెట్టడం అంటే పిచ్చి సన్నాసి చేసే పని, అది కూడా రేవంత్ రెడ్డి చేసాడు” అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ భూముల వ్యవహారంపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఇప్పటివరకు కేంద్రం నుంచి విచారణకు ఆదేశాలు రాకపోవడంపై కూడా కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం నిజంగా పారదర్శకంగా ఉండాలంటే ఈ కుంభకోణంపై వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
“మోడీకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆదేశాలు ఇవ్వాలి. లేదంటే ఆయన ప్రభుత్వం మాటల ప్రభుత్వమే అన్న అభిప్రాయానికి తెలంగాణ ప్రజలు కూడా చేరుకుంటారు” అంటూ ఎద్దేవా చేశారు.
Read More : హైదరాబాద్‌లో అమాయక కుక్క పిల్లలపై దారుణం — ఫతేనగర్‌లో కలకలం!
