భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీకి అండగా నిలిచారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ ఆర్థికంగా కుదేలైన కాంబ్లీ పరిస్థితిని గమనించిన గవాస్కర్, తన ‘చాంప్స్ ఫౌండేషన్’ ద్వారా జీవితకాలం ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చారు.
ఇటీవల ముంబై వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవ వేడుకల్లో గవాస్కర్, కాంబ్లీని కలిసిన సమయంలో అతడి నీరసించిన స్థితిని చూచి గవాస్కర్ తీవ్రంగా చలించారని సమాచారం. వెంటనే వైద్యులను సంప్రదించి కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలుసుకున్న గవాస్కర్, ఆర్థికంగా వెంటనే సహాయానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో వచ్చే నెల అంటే 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రతి నెలా రూ.30,000, అలాగే ప్రతి సంవత్సరం వైద్య ఖర్చుల నిమిత్తం అదనంగా రూ.30,000 గ్రాంటును చాంప్స్ ఫౌండేషన్ తరఫున అందించాలంటూ గవాస్కర్ ఆదేశాలు జారీ చేశారు.
క్రీడా రంగంలో ఓ వెలుగు వెలిగిన తర్వాత అనేక కారణాల వల్ల ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కాంబ్లీ తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం బీసీసీఐ నుండి వచ్చే పెన్షన్ మాత్రమే అతడి జీవనాధారంగా ఉంది.
ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ, కాంబ్లీ లాంటి క్రీడాకారులు కష్టాల్లో ఉన్నప్పుడు, వారి పక్కన నిలబడి అవసరమైన మద్దతును అందించాలనే సంకల్పంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, మళ్లీ స్థిరపడేందుకు అవసరమైన సహకారం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు.
కాంబ్లీ తనపై చూపిన మానవతా హృదయానికి గవాస్కర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సహాయం తనకు ‘ఆశాకిరణం’ లాంటిదని భావోద్వేగంగా స్పందించారు. రిటైర్మెంట్ తర్వాత క్రీడాకారులు ఎదుర్కొనే సమస్యలను ఈ ఘటన మరోసారి సమాజానికి గుర్తుచేస్తోంది.
Read More : ఐపీఎల్ 2025: బ్యాట్ సైజులపై అంపయర్లు కఠిన తనిఖీ – క్రికెట్ నిబంధనల ప్రకారం

One thought on “ఆర్థిక సంక్షోభంలో కాంబ్లీకి అండగా సునీల్ గవాస్కర్”
Comments are closed.