YS భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై పార్టీ కఠిన చర్యలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సతీమణి వైఎస్‌ భారతిపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై తెలుగుదేశం పార్టీ అధిష్టానం కఠినంగా స్పందించింది. కిరణ్‌ను పార్టీ సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తూ, అతనిపై పోలీసు కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, టీడీపీ అధిష్టానం మహిళలపై అనుచిత వ్యాఖ్యలను ఉపేక్షించదని స్పష్టం చేసింది. పార్టీ శాసనానికి భిన్నంగా వ్యవహరించినందుకు కిరణ్‌పై చర్యలు తీసుకున్నట్లు అధికార ప్రతినిధులు తెలిపారు. గురువారం గుంటూరులో పోలీసులు కిరణ్‌ను అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం.

ఇక వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కిరణ్, తన వ్యాఖ్యలు బాధను కలిగించినట్లయితే క్షమించాలని కోరుతూ ఓ వీడియో విడుదల చేశాడు. “క్షణికావేశంలో మాటలు పలికాను. ఎవరినైనా బాధపెట్టినట్లయితే హృదయపూర్వకంగా మన్నించండి,” అని ఆ వీడియోలో పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే, గతంలో వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భవానేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఇప్పుడు అదే తరహాలో టీడీపీ కార్యకర్త వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాజకీయ నాయకులు, పార్టీలను నెగెటివ్‌గా ప్రభావితం చేసే ఇటువంటి చర్యలు సంస్కృతికి విరుద్ధమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More : పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెన్సేషనల్ కామెంట్స్..