కరీంనగర్, ఏప్రిల్ 6: తెలంగాణలో పాలన పూర్తిగా భ్రష్టుపట్టిందని, దీనికి మంత్రివర్గ విస్తరణను ఏఐసీసీ నిర్ణయించడం, సచివాలయంలో కాంగ్రెస్ నేతలు సమీక్షలు నిర్వహించడం ప్రత్యక్ష ఉదాహరణలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లో ఆదివారం జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్ సచివాలయంలో సమీక్ష చేయడం ఏ విధంగా న్యాయసమ్మతమని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం సీఎం కాకుండా ఏఐసీసీ తీసుకుంటుండటం సీఎం రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంపుగా మారిపోయినట్టు సూచిస్తున్నదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైందని, హెచ్‌సీయూ భూముల వివాదం, ఇతర వ్యవహారాలు పాలనా వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నాయని విమర్శించారు.
ఎంఐఎంకు బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతు – బీజేపీని అడ్డుకునే కుట్ర
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం తరఫున కాంగ్రెస్, బీఆర్ఎస్లు కలిసి పనిచేస్తున్నాయన్నారు బండి సంజయ్. దేశభక్తి బీజేపీకి వ్యతిరేకంగా దేశద్రోహ ఎంఐఎంకు మద్దతుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, సన్నబియ్యం పథకానికి కేంద్రం రూ.37 కేటాయిస్తే రాష్ట్రం కేవలం రూ.10 మాత్రమే ఖర్చుపెడుతోందని వివరించారు. అంతటి మద్దతు ఉన్నప్పటికీ రేషన్ షాపుల వద్ద మోదీ ఫోటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.
Read More : తెలంగాణలో విమాన సేవలకు మరో ముందడుగు: ఆదిలాబాద్ ఎయిర్ స్ట్రిప్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
