తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం..

తెలంగాణలో బర్డ్ ఫ్లూ మళ్లీ కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఓ ప్రైవేట్ పౌల్ట్రీ ఫారంలో వేలాది కోళ్లు విఘతజీవులయ్యాయి. గత నాలుగు రోజులుగా అనుమానాస్పదంగా మరణిస్తున్న కోళ్ల నుంచి రక్త నమూనాలను సేకరించిన అధికారులు… పరీక్షల అనంతరం బర్డ్ ఫ్లూ (Avian Influenza) ఉందని నిర్ధారించారు.

ఈ క్రమంలో పౌల్ట్రీ ఫారంలో ఉన్న మృత కోళ్లను జేసీబీ సహాయంతో గుంత తీసి పూడ్చివేసినట్లు సమాచారం. వైరస్ మరింత వ్యాపించకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే కోడి గుడ్లు, ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులను ఎవరికీ అమ్మొద్దని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘటనతో పౌల్ట్రీ యాజమానులు తీవ్ర ఆర్థిక నష్టంలో చిక్కుకున్నారు. కోళ్ల మృతితో లక్షల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు.

ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. పౌల్ట్రీ పరిశ్రమకు మరోసారి బర్డ్ ఫ్లూ చేదు అనుభవాన్ని మిగిల్చింది.

Read More : అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు..