“ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమంపై ఇప్పటివరకు ఏలాంటి కేసులు నమోదు కాలేదని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని విషయాలు స్పష్టంగా వివరించినట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని, అన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని స్పష్టం చేశారు. తనకు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఈ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేదని రోజా పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ బలమైన నేతలను రాజకీయ కక్షసాధింపు కింద తప్పుడు కేసులతో టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకూడదనే ఉద్దేశంతోనే ఈ కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. తన అరెస్టును సంబరంగా మార్చుకోవాలని కొంతమంది భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆమె తెలిపారు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రోజా విమర్శించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పంలో గంజాయి సాగు పెరిగిపోతోందని ఆరోపించారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా మారిపోయారని, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వం రెడ్ బుక్ కోసం కాకుండా, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని రోజా హితవిచ్చారు.
Read More : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు భారీ నిధుల మంజూరు…
