2027లో అరుదైన సూర్యగ్రహణం

2027 ఆగస్టు 2న భూమిపై ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన చోటుచేసుకోనుంది. దీనిని ‘గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్‌’గా పిలుస్తున్నారు. ఈ సంపూర్ణ సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుని పూర్తిగా కప్పేస్తాడు. ఫలితంగా భూమి సుమారు 6 నిమిషాల 23 సెకన్ల పాటు అంధకారంలోకి వెళ్లనుంది. ఇది 1991 నుండి 2114 వరకు మన గ్రహంపై కనిపించే అత్యంత సుదీర్ఘ సూర్యగ్రహణంగా నిలవనుంది.

♦ కనిపించే ప్రాంతాలు:

ఈ గ్రహణం అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రారంభమై, తూర్పు దిశగా కదిలుతూ యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యంపై కనిపిస్తుంది.
సంపూర్ణ గ్రహణం (టోటాలిటీ) కేవలం 258-275 కిలోమీటర్ల వెడల్పు గల మార్గంలో మాత్రమే స్పష్టంగా దర్శనమిస్తుంది.

  • స్పెయిన్: కాడిజ్, మలాగా ప్రాంతాల్లో 4 నిమిషాలకు పైగా చీకటి అలుముకుంటుంది
  • మొరాకో: టాంజియర్, టెటౌవాన్ ప్రాంతాల్లో 6 నిమిషాలకు పైగా అంధకారం
  • ఈజిప్ట్: లక్సర్ సమీపంలో కూడా దీర్ఘకాలపు సంపూర్ణ గ్రహణం
  • మధ్యప్రాచ్యం: జెడ్డా, మక్కా, యెమెన్, ఈశాన్య సోమాలియా తదితర ప్రాంతాల్లో గ్రహణం

ఈ గ్రహణం చివరకు భారత మహాసముద్రంలో ముగుస్తుంది. దారిలో చాగోస్ దీవులు కూడా ఉంటాయి.

♦ గ్రహణ ప్రత్యేకత:

ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భూమి సూర్యునికి అత్యధిక దూరంలో (అఫీలియన్) ఉండే సమయంలో జరుగుతుంది. అదే సమయంలో చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా (పెరిజీ) ఉంటుంది.
ఈ కారణంగా సూర్యుడు చిన్నగా, చంద్రుడు పెద్దగా కనిపించటం వలన గ్రహణం సమయం ఎక్కువగా ఉంటుంది.
అంతేగాక, ఇది భూమధ్యరేఖ సమీపంలో సంభవించటం వల్ల చంద్రుని నీడ భూమిపై నెమ్మదిగా కదలటం జరుగుతుంది, దీని వలన గ్రహణం సమయం మరింత పెరుగుతుంది.

♦ భారత్‌లో కనిపించదు!

ఈ అద్భుత దృశ్యం భారతదేశంలో కనిపించదు. అంతేకాక తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లోనూ ఈ గ్రహణం కనిపించదు. కొన్ని ప్రాంతాల్లో కేవలం ఆంశికంగా మాత్రమే కనిపించే అవకాశముంది.

ఈ 100 ఏళ్లలో ఒకసారి మాత్రమే వచ్చే ఖగోళ దృశ్యం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఖగోళ ప్రేమికులు ఇప్పటికే ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Read More : మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ జాడ పసిగట్టిన భారత్