కస్టమర్ కేర్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ, జనవరి 7: కస్టమర్ కేర్ మోసాలు, మాల్‌వేర్ సహా సైబర్ నేరాలతో ఖాతాలు ఖాళీ చేసే సంఘటనల్లో బాధితులకు న్యాయం జరగడంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అనుమతి లేని లేదా మోసపూరిత ఆన్‌లైన్ లావాదేవీల వల్ల డబ్బు కోల్పోయిన బాధితులు, నేరం జరిగిన మూడురోజుల్లో ఫిర్యాదు చేస్తే బ్యాంకులు పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
గువాహటి నివాసి పల్లభ్ భౌమిక్ కేసులో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌ల ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. 2021లో పల్లభ్ భౌమిక్ లూయీ ఫిలిప్ వెబ్‌సైట్ ద్వారా బ్లేజర్‌ను కొనుగోలు చేయగా, ఆ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైంది. కస్టమర్ కేర్ పేరుతో సైబర్ నేరగాళ్లు అతనిని సంప్రదించి, మాల్‌వేర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించి, అతని ఎస్‌బీఐ ఖాతా నుంచి రూ.94,204.80 గూగుల్ పే ద్వారా బదిలీ చేశారు.
తదుపరి, బాధితుడు ఎస్‌బీఐ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసినా, స్పందన సత్ఫలితంగా రాలేదు. హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు విచారణలో బ్యాంకులదే పూర్తి బాధ్యత అని తేల్చిచెప్పింది. బ్యాంకులు మోసపూరిత లావాదేవీలను గుర్తించి నియంత్రించడంలో అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది.
ఖాతాదారులకు హెచ్చరిక
ఓటీపీలు లేదా వ్యక్తిగత వివరాలను ఇతరులకు వెల్లడించకూడదని, నిర్లక్ష్యం వల్ల ఖాతాదారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
ఆశారాంనకు మధ్యంతర బెయిల్
రాజస్థాన్ జోధ్‌పూర్ జైలులో ఉన్న ఆశారాం బాపు అనారోగ్య కారణాలతో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మార్చి 31 వరకు ఈ బెయిల్ కొనసాగుతుందని, ఆ సమయంలో అనుయాయులను కలవకూడదని కోర్టు షరతు విధించింది.
