విచారణ కి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన అల్లు అర్జున్

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ (Allu Arjun) మంగళవారం చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఉదయం 10.30 గంటలకు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 60లోని తన నివాసం నుంచి బయల్దేరిన ఆయన, తన తండ్రి మరియు నిర్మాత అల్లు అరవింద్‌తో కలిసి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్రెడ్డి మరియు బన్నీ వాసు కూడా ఉన్నారు.

సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు అల్లు అర్జున్ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఏసీపీ రమేశ్, ఇన్స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఈ విచారణను నిర్వహిస్తున్నారు.

గతంలో సంధ్య థియేటర్లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై పోలీసులు అల్లు అర్జున్కు సోమవారం నోటీసులు పంపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరయ్యే ముందు, అల్లు అర్జున్ తన లీగల్ టీమ్‌తో నోటీసులపై సంప్రదింపులు జరిపారు.

సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు తాజాగా 10 నిమిషాల వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఆధారంగా సినీనటుడు అల్లు అర్జున్ను (Allu Arjun) విచారించే అవకాశముంది. అంతేకాదు, ఆయన నిర్వహించిన ప్రెస్‌మీట్‌ గురించిన వివరాలపై కూడా ప్రశ్నలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేషన్ పరిసరాల్లో 200 మీటర్ల మేర ట్రాఫిక్‌ను నిలిపివేసి, పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ నెల 4న రాత్రి సంధ్య థియేటర్లో ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్బంగా అల్లు అర్జున్ హాజరైన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంతో ఒకరి మృతికి కారణమయ్యారని ఆరోపణలతో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంచల్గూడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివిధ కోణాల్లో వివరాలను సేకరిస్తున్నారు