రాజమండ్రి సమీపంలో రేవ్ పార్టీ కలకలం: 13 మంది అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం

తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి సమీపంలోని బూరుగుపూడి జంక్షన్ వద్ద ఉన్న నాగ సాయి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీ (Rave Party) గందరగోళానికి దారితీసింది. ఈ ఘటనలో పోలీసులు చర్యలు తీసుకుని 13 మంది వ్యక్తులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

ఫెర్టిలైజర్స్ షాపుల యజమానులు ఈ రేవ్ పార్టీని నిర్వహించినట్లు సమాచారం. ఇది తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు (Special Branch Police) ఫంక్షన్ హాల్‌లో దాడి చేసి, పాల్గొన్న వారితో పాటు మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని కోరుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

రాజమండ్రి నుంచి స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ప్రత్యక్ష చర్యతో రేవ్ పార్టీ బయటపడింది. గోదావరి జిల్లాలో ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న రేవ్ పార్టీల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నవారు మద్యం సేవించినట్లు తెలుస్తున్నప్పటికీ, డ్రగ్స్ వాడలేదని రాజమండ్రి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. రాత్రంతా పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్సులు చేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. ఉన్నతస్థాయి అధికారుల సమాచారం మేరకు పోలీసులు ఈ దాడి చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.