తిరుమల: ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణరథం
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద నుంచి ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణరథం పయనమైంది. కళ్యాణరథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి జెండా ఊపి కళ్యాణరథాన్ని ప్రయాగ్‌రాజ్‌కు పంపారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ నెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనున్న మహా కుంభమేళా సందర్భంగా 2.5 ఎకరాల్లో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.
నమూనా ఆలయంలో స్వామి వారికి నిత్య కైంకర్యాలు నిర్వహించడంతో పాటు, జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో ప్రత్యేక కళ్యాణోత్సవ సేవలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడానికి 150 మంది సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించామన్నారు.
మహా కుంభమేళా ప్రత్యేకతలు:
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహా కుంభమేళాకు దేశవిదేశాల నుంచి 40 కోట్ల మంది వరకు భక్తులు చేరుకుంటారని అంచనా. యాత్రికుల రవాణా సౌకర్యాల కోసం రైల్వే శాఖ భారీ ఏర్పాట్లు చేసింది.
50 రోజులపాటు మొత్తం 13 వేల రైళ్లు నడపనున్నారు. వీటిలో పది వేలు రెగ్యులర్ సర్వీసులు కాగా, మూడు వేలు ప్రత్యేక రైళ్లు. కుంభమేళా జరగడానికి ముందు 2-3 రోజుల పాటు, తరువాత 2-3 రోజుల పాటు రైళ్లు నడుస్తాయి.
ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలోని 9 రైల్వే స్టేషన్లలో 560 టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, భద్రత కోసం 18 వేల మంది రైల్వే రక్షణ దళం, రాష్ట్ర రైల్వే పోలీసులు మోహరించారు. ప్రయాణికుల ఆరోగ్యసేవల కోసం ఆక్సిజన్ సిలిండర్లు, ఈసీజీ యంత్రాలు, అబ్జర్వేషన్ రూమ్‌ను ఏర్పాటుచేశారు.
ఉగ్ర బెదిరింపు:
మహా కుంభమేళాకు ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది. “ఉగ్రదాడి చేసి వెయ్యిమందిని చంపుతానంటూ” సోషల్ మీడియాలో బెదిరింపు పోస్టు పెట్టిన ఆయుష్‌కుమార్ జైస్వాల్‌ను మహాకుంభ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో ఈ బెదిరింపు నకిలీగా తేలింది.
