“ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం: భట్టి విక్రమార్క స్పష్టం”

ఎన్ని ఇబ్బందులున్నా ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజలు తమ అవసరాలు, ఇబ్బందులను నేరుగా చెప్పుకోవడానికి ప్రజా ప్రభుత్వం ప్రజావాణిని ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది పూర్తి కావడాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్ ప్రజాభవనంలో అధికారులకు ఆయన ప్రసంగించారు.

పొడుభూముల సాగు కోసం రైతులకు సౌరవిద్యుత్ ఏర్పాటుకు గిరిజన సంక్షేమశాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. “ప్రజావాణి ద్వారా అందించిన దరఖాస్తులకు పరిష్కారం లభిస్తోంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. మా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తోంది. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును కంప్యూటరీకరించి సంబంధిత అధికారులకు పంపించి, ఆ సమస్య పరిష్కారానికి తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు తెలియజేస్తూ నిరంతర పర్యవేక్షణతో కొనసాగుతోంది. దరఖాస్తుదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలు ప్రజల కోసమే పనిచేస్తున్నాయి” అని భట్టి పేర్కొన్నారు.

అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పొందిన పోడు రైతుల సాగు అవసరాల కోసం సౌరవిద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. “గత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న భా.రా.స. పోడు రైతుల సమస్యలను పట్టించుకోలేదు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను గత పాలకులు విస్మరించారు. గత ప్రభుత్వం తెలంగాణను 70 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లింది. వారు భావ స్వేచ్ఛ, ప్రగతిశీల ఆలోచనలకు స్థానం ఇవ్వకుండా రాష్ట్రాన్ని గుప్పిట్లో బంధించి పాలించారు. కాంగ్రెస్ హయాంలో తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని తొలగించి, పోడు రైతుల సమస్యలను పట్టించుకోలేదు” అని భట్టి విమర్శించారు.

“ప్రజలు సమస్యలు పరిష్కరించమని కోరడంతో కాంగ్రెస్ పార్టీని దీవించి అధికారాన్ని కట్టబెట్టారు” అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. మంగళవారం ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 424 వినతులు అందినట్లు సమాచారం.