పుట్టినరోజున ప్రమాణ స్వీకారం
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్డీసీ) చైర్మన్గా నియమితులైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు (వెంకటరమణారెడ్డి) బుధవారం తన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు కావడం విశేషం. కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైన దిల్ రాజు, ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు సినిమా అభివృద్ధికి కృషి
మీడియాతో మాట్లాడుతూ దిల్ రాజు, “చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందింది. కానీ, ప్రపంచస్థాయిలో తెలుగు సినిమా ఇంకా చాలా ముందుకు వెళ్లాలి. టీఎఫ్డీసీకి పూర్వ వైభవం తీసుకురావడం నా ప్రధాన లక్ష్యం. పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా పని చేస్తాను. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలు తెరకెక్కేందుకు ప్రోత్సహిస్తాను” అని తెలిపారు.
హీరో రామ్చరణ్ అభినందనలు
దిల్ రాజు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, హీరో రామ్చరణ్ పుష్పగుచ్చం అందజేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
