నల్లగొండలో ఆపరేషన్‌ చబూత్ర: అర్ధరాత్రి చెకింగ్‌లో 154 మందికి కౌన్సిలింగ్

నల్లగొండలో ఆపరేషన్‌ చబూత్ర

నల్లగొండ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి పోలీసులు ఆపరేషన్‌ చబూత్ర నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో, ద్విచక్ర వాహనాలపై అనవసరంగా తిరుగుతున్న 154 మందిని అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఆదేశాల మేరకు, డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో నల్లగొండలోని అన్ని కాలనీలను అష్టదిగ్బంధం చేశారు.

ఈ ఆపరేషన్‌లో నల్లగొండ వన్‌టౌన్‌, టూటౌన్‌, రూరల్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 13 చెకింగ్‌ బృందాలు మరియు 10 పెట్రోలింగ్‌ పార్టీలుగా సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు కలిసి పనిచేశారు. ఈ సమయంలో 88 బైకులు, 6 కార్లు, 15 ఆటోలు మరియు 78 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

మద్యం తాగి వాహనాలు నడిపిన 54 మందిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. డిసెంబరు 31వ తేదీ సందర్బంగా, అర్థరాత్రి రోడ్లపై అనవసరంగా తిరిగే వారిపై చర్యలు తీసుకోబడతాయని, వారి తల్లిదండ్రుల సమక్షంలో మరోసారి కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో సీఐలు ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, దూది రాజు, ఎస్‌ఐలు రావుల నాగరాజు, జూకూరి సైదులు, సురేష్‌, సందీప్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.