ఉదయం నిద్రలేవగానే అలికిడి… కుర్చీలో కూర్చొని పత్రిక చదువుతుండగా కాళ్ల కింద భూమి స్వల్పంగా కదలిక… కళ్లు తిరిగినట్లై చేతిలోంచి పడిపోయిన మొబైల్… వంటింట్లో అప్పుడే సర్దిన పాత్రలు కింద పడిన శబ్దం… ఏమైందో తెలియక బయటకు పరుగులు తీసిన జనం… తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల ప్రజలు 55 ఏళ్ల తర్వాత భూప్రకంపనల ప్రభావాన్ని ప్రత్యక్షంగా చవిచూసి కలవరపడ్డారు. అనంతరం సోషల్మీడియా ద్వారా వెల్లువెత్తిన సందేశాల ప్రకంపనలతోనూ ప్రజలు మరింత హడలిపోయారు.
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం 7:27 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ భూకంపం కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుండి బయటకు పరుగులు తీశారు. ములుగు జిల్లా మేడారం సమీపంలో భూకంప కేంద్రాన్ని హైదరాబాద్ జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్టీస్ఐ) మరియు దిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) గుర్తించారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం 5.3 తీవ్రతతో నమోదైందని ఈ రెండు సంస్థలు ప్రకటించాయి. 1969లో భద్రాచలంలో 5.7 తీవ్రతతో వచ్చిన భూకంపం తర్వాత, ఈ స్థాయి భూకంపం 55 ఏళ్ల తర్వాత వచ్చినట్లు ఎన్టీఆర్ఏ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప కేంద్రం నుండి 200 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనాలు అనుభవించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు మహారాష్ట్ర మరియు ఛత్తీస్ గఢ్ లో కూడా స్వల్ప ప్రకంపనలు వచ్చాయి.
తెలంగాణలో వరంగల్, ములుగు, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలలోనూ ప్రకంపనలు వచ్చాయి. ఏటూరునాగారంలోని శివాలయం వీధిలో ఒక ఇల్లు స్వల్పంగా దెబ్బతింది. శంకరరాజుపల్లిలో ఒకరి ఇంటి గోడ కుప్పకూలింది. ఖమ్మంలో 3 సెకన్లపాటు ప్రకంపనలు వచ్చాయని, భద్రాచలంలో ఇళ్లలోని వంట పాత్రలు కింద పడిపోయాయని, ఇళ్లలో కుర్చీలు, బీరువాలు ఊగడాన్ని గృహిణులు తెలిపారు. హైదరాబాద్ లోని వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, అత్తాపూర్, బీహెచ్ఎల్, గచ్చిబౌలితోపాటు వివిధ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెప్పారు.
భూకంప ప్రభావం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు తదితర ప్రాంతాల్లో కూడా కనిపించింది. అలాగే ఛత్తీస్ గఢ్ వివిధ ప్రాంతాలు మరియు మహారాష్ట్రలోని నాగ్పూర్, గడ్చిరోలి, చంద్రాపుర్ జిల్లాల్లోనూ స్వల్ప ప్రకంపనలు వచ్చాయి.
భూకంపం సంభవించిన ప్రాంతం వరంగల్ కు 85 కి.మీ. దూరంలో ఉంది. “ములుగు ప్రాంతం వరంగల్ కు ఈశాన్యంగా 85 కి.మీ., బీజాపూర్(ఛత్తీస్ గఢ్) కు నైరుతి దిశలో 65 కి.మీ., హైదరాబాద్కు వాయవ్యంగా 218 కి.మీ., విజయవాడ(ఆంధ్రప్రదేశ్) కు ఉత్తరాన 212 కి.మీ. దూరంలో ఉందని ఎన్.సి.ఎస్ వెల్లడించింది. భూమి పొరలలో 40 కి.మీ. లోతులో ఈ భూకంపం సంభవించడంతో భూకంప శక్తి వెదజల్లే తీవ్రత తగ్గింది” అని తెలిపింది.
గోదావరి ఫాల్ట్ కారణం: “ములుగు ప్రాంతంలో ఈ భూకంపం సంభవించడానికి గోదావరి ఫాల్ట్ ప్రధాన కారణం. భూమి పొరలలోని లోపాలను ఫాల్ట్ అంటారు. భారత భూపలక ఉత్తర దిశగా కదులుతూ హిమాలయాల కిందకు వెళ్ళిపోయే ప్రక్రియలో భూమి పొరల సర్దుబాట్లతో భూకంపాలు సంభవిస్తుంటాయి” అని ఎన్టీస్ఐ భూకంప శాస్త్రవేత్త డాక్టర్ ఎం. శేఖర్ వివరించారు.
మరిన్ని స్వల్ప ప్రకంపనల అవకాశాలు: “ఈ భూకంపాన్ని టెక్టోనిక్ ఎర్త్ క్వేక్ గా పరిగణించాలి. ఇది పెద్ద భూకంపం అయినప్పటికీ, చాలా లోతులో సంభవించడం వల్ల ప్రభావం తక్కువగా ఉంది. ఈ రకమైన భూకంపం తర్వాత కొద్దిరోజుల్లో చిన్న చిన్న భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుంది, అయితే వాటి తీవ్రత మొదటి భూకంపం కంటే తక్కువ ఉంటుంది” అని ఎన్టీఆర్ఐ విశ్రాంత శాస్త్రవేత్త శ్రీనగేశ్ తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులపై ఇంజినీర్లు పరిశీలన: భూకంపంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లు ఉలిక్కిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి నష్టం జరగకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రఖ్యాత రామప్ప ఆలయాన్ని కూడా పురావస్తు శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ డా. హెచ్.ఆర్. దేశాయ్ పరిశీలించారు. గుడికి ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. తెలంగాణలో ఎలాంటి నష్టం జరగలేదని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ప్రకటించారు.
