కెనడా విక్రయానికి కాదు.. ట్రంప్‌కు ప్రతిపక్ష నేత జగ్మీత్ సింగ్ గట్టి హెచ్చరిక
NDP లీడర్ జగ్మీత్ సింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన భూవిస్తరణ ఆశలను బహిరంగంగా ప్రకటిస్తూ, పొరుగు దేశాలతో వివాదాలు పెంచుతున్నారు. ఈ క్రమంలో కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా విలీనం చేయాలనే వ్యాఖ్యలు చేసి, ప్రపంచ వ్యాప్తంగా చర్చకు తెరతీశారు. కెనడా ప్రజలు తమ దేశం అమెరికాలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, లేకపోతే కెనడా దిగుమతులపై 25% సుంకాలు విధిస్తానని ఇటీవల ట్రంప్ హెచ్చరికలు చేశారు.
జగ్మీత్ సింగ్ ఘాటైన స్పందన
కెనడా ప్రతిపక్ష నాయకుడు, నేషనల్ డెమోక్రటిక్ పార్టీ (NDP) నేత జగ్మీత్ సింగ్ ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఎక్స్‌లో (మాజీ ట్విట్టర్) ఆయన స్పందిస్తూ, “డొనాల్డ్ ట్రంప్‌కు నేను స్పష్టమైన సందేశం ఇస్తున్నాను. మా దేశం అమ్మకానికి లేదు. కెనడియన్లంతా తమ దేశంపై గర్వంతో ఉన్నారు. మా స్వాతంత్ర్యాన్ని కోల్పోవడానికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. మీకే గమనిక, కెనడాను చేతికొనగొట్టాలనుకుంటే, మా ప్రజల ప్రతినిథుల గట్టి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది” అంటూ హెచ్చరించారు.
ట్రంప్ వ్యాఖ్యలు వివాదాస్పదం
ట్రంప్ తన వ్యాఖ్యల్లో కెనడా ప్రధానిని ‘గవర్నర్’గా సంబోధించి ఎద్దేవా చేశారు. అక్రమ వలసల సమస్యను పరిష్కరించలేకపోతే, కెనడాను అమెరికా రాష్ట్రంగా చేర్చుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు కెనడా రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి.
కెనడా ప్రజల తుది మాట
జగ్మీత్ సింగ్ మాత్రమే కాకుండా, కెనడా ప్రజలందరూ ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. “మా స్వాతంత్ర్యం మా కోసం విలువైనది. ఎవరూ మా దేశాన్ని కొనుగోలు చేయలేరు, దానిని ఆక్రమించలేరు. కెనడియన్లు తమ హక్కుల కోసం ఎప్పటికీ పోరాడతారు” అని పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు.
ట్రంప్ మరియు కెనడా నేతల మధ్య ఈ వివాదం దశలు దాటుతోంది. భవిష్యత్‌లో అమెరికా, కెనడా మధ్య సంబంధాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.