Game Changer: శంకర్ మనసులో మాట బయటకొచ్చింది
తాజాగా డల్లాస్ (యూఎస్ఏ)లో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు శంకర్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
శంకర్ మాటల్లోనే..
కోలీవుడ్ అగ్ర దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమైంది.
డల్లాస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, ‘‘ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నా. ఇక్కడకు రావాలా వద్దా? అనుకున్నా. కానీ మీ అందరి ఎనర్జీ చూసేందుకు ఇక్కడికి వచ్చా. తెలుగులో నా తొలి చిత్రం ఇది. తమిళంలో, హిందీలో చిత్రాలు చేసినా, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ప్రేమను చూపించారు. చిరంజీవితో సినిమా చేయాలని చాలా ప్రయత్నించా కానీ వర్కౌట్ కాలేదు. మహేశ్‌బాబుతోనూ మాట్లాడా. ప్రభాస్‌తో కరోనా సమయంలో చర్చలు జరిగాయి. కానీ చివరకు రామ్ చరణ్‌తో సినిమా చేయాలని రాసి పెట్టి ఉంది.
ఈ చిత్రం ప్రభుత్వం, రాజకీయ నాయకుల మధ్య మధ ఘర్షణ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కింది. రామ్ చరణ్ తన నటనతో అద్భుతంగా అలరించారు. కాలేజ్ లుక్‌లో ఫైర్‌గా కనిపించారు. పంచెకట్టులో అప్పన్నగా మరింత ఆకట్టుకున్నారు. సంగీత దర్శకుడు తమన్ గొప్ప పాటలను అందించారు. ‘డోప్’ పాట కోసం లక్షకు పైగా చిన్న లైట్లను ఉపయోగించాం. గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌లో ‘జరగండి’ పాట కోసం విలేజ్ సెట్‌ను రూపొందించాం. సాబూ సిరిల్ సెట్స్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు. అందరికీ మంచి పాత్రలు లభించాయి. దిల్ రాజు ఈ సినిమాను ముందుకు నడిపించారు’’ అని అన్నారు.
బుచ్చిబాబుతో రామ్ చరణ్ మరో విజయం సాధించబోతున్నారని శంకర్ నమ్మకం వ్యక్తం చేశారు.
