ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితులు అయిన బీవీ శ్రీనివాస్ రెడ్డి (ఏ1), గాలి జనార్ధన్ రెడ్డి (ఏ2)లకు ఏడేళ్ల శిక్షను విధించింది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అలాగే, కేసులో మరో ముగ్గురు దోషులకు కూడా శిక్ష ఖరారైంది.
ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. వీరిద్దరిపై ఎలాంటి నేరారోపణలు రుజువుకాకపోవడంతో ఈ తీర్పు ఇచ్చినట్లు పేర్కొంది.
కేసు వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా ఓబుళాపురంలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంపై 2009 డిసెంబర్ 7న సీబీఐ కేసు నమోదు చేసింది. దాదాపు 14 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ సాగింది. మొత్తం నాలుగు ఛార్జ్‌షీట్లు దాఖలయ్యాయి. మొదటి ఛార్జ్‌షీట్ 2011లో దాఖలయింది. ఇందులో గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరుడు శ్రీనివాస్ రెడ్డి కలిసి అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపి, భారీగా ఇనుము ఖనిజాన్ని ఎగుమతి చేశారని పేర్కొన్నారు. దాదాపు రూ.844 కోట్లు ప్రజాధనం దుర్వినియోగమైందని పేర్కొనడం జరిగింది.
ఈ కేసులో మొత్తం 219 మంది సాక్షులను విచారించారు. 3337 పత్రాల ఆధారంగా సాక్ష్యాలు సమర్పించారు. సీబీఐ ఆధారంగా చార్జ్‌షీట్లు రూపొందించి కోర్టుకు సమర్పించింది. దర్యాప్తులో ఐపీసీ సెక్షన్లు 120బీ, 420, 409, 468, 471తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1)(డి) కింద అభియోగాలు నమోదయ్యాయి.
అంతేగాక, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)కి సంబంధించిన సంస్థను కూడా ఈ కేసులో దోషిగా తేల్చింది కోర్టు. ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు అప్పటికే జైలు జీవితం గడిపారు. కానీ మాజీ గనులశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రం అరెస్ట్ కాలేదు.
సబితపై డిశ్చార్జ్ పిటిషన్ తొలుత తిరస్కరించినా, ఆ తర్వాత ఆమెపై తగిన ఆధారాలు లేనందున కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. అదే విధంగా ఐఏఎస్ అధికారి కృపానందం కూడా తన పాత్ర లేకపోవడంతో కోర్టు అతనిని కూడా నిర్దోషిగా ప్రకటించింది.
Read More : కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం

One thought on “ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు”
Comments are closed.