లుక్ ఔట్ నోటీసులు: ఎంపీ విజయసాయిరెడ్డిపై చర్యలు
అమరావతి: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయనతో పాటు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో సంస్థ యజమాని శరత్ చంద్ర రెడ్డిపై కూడా లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. వీరు విదేశాలకు పారిపోకుండా దేశంలోని అన్ని విమానాశ్రయాలకు ఈ నోటీసులు పంపించామని సీఐడీ అధికారులు వెల్లడించారు.
కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లో రూ. 3,600 కోట్ల విలువైన వాటాలను కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) నుంచి బలవంతంగా లాక్కున్నారనే కేసులో ఈ ముగ్గురు కీలక నిందితులుగా ఉన్నారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించి, అరబిందో సంస్థకు అధిక షేర్లు బలవంతంగా రాయించుకున్నారని ప్రధాన అభియోగం. దీనిపై విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
