ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచిత ఇసుక: రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సర కానుక

రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకగా ఇసుకను ఉచితంగా అందించేందుకు యోచన

ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం

ఇప్పటికే ఒక్కో ఇంటికి 37-40 టన్నుల ఇసుక అవసరమవుతుందని అంచనా

4.50 లక్షల ఇళ్లకు 112 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అవసరం

ప్రతీ ఇంటి కోసం అదనంగా రూ.60 వేలు ఖర్చు అవుతుందని సమాచారం

హైదరాబాద్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందించేందుకు సిద్దమవుతోంది. దీనికి సంబంధించి తాజా నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అదనంగా, సిమెంటు, ఇనుమును కూడా తక్కువ ధరకే అందించాలని నిర్ణయించింది.

ప్రధానంగా, 4.50 లక్షల ఇళ్లకు 112 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అవసరమవుతుందని అధికారులు అంచనా వేసారు. ఒక్కో ఇంటికి 25 క్యూబిక్‌ మీటర్ల (37-40 టన్నులు) ఇసుక అవసరం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఖనిజాభివృద్ధి సంస్థతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తోంది.

ప్రస్తుతం మార్కెట్‌లో టన్ను ఇసుక ధర రూ.1400-1500 వరకు ఉంది. ఇసుక ధరలు ప్రాంతాలపై ఆధారపడి మారుతుంటాయి. ఉదాహరణకు, ఖమ్మం లో ఇసుక ధర రూ.1400 ఉండగా, హైదరాబాద్‌లో అది రూ.1600-1700 వరకు చేరుతుంది. ఈ ధరలను దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం ప్రతీ ఇంటికి సుమారు రూ.60 వేలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని అధికారులు తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఉచిత ఇసుక ఇవ్వడం, తర్వాత అవకతవకలు జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు కూడా ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. రవాణా చార్జీల విషయంలో కూడా ప్రభుత్వం కొంత స్పష్టత ఇవ్వాల్సి ఉంది.