ఇటు సార్వా.. అటు దాళ్వా
వరుస వాయుగుండాలతో రైతుల పనులపై ప్రభావం
నాట్ల కోసం వేగం పెంచిన రైతులు
భీమవరం రూరల్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వరుస వాయుగుండాలు, అల్పపీడనాల ప్రభావంతో సాగు పనులకు అంతరాయం కలిగినా, రైతులు ఇటు సార్వా మాసూళ్లు, అటు దాళ్వా నారుమడుల పనులను వేగంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల వచ్చిన తుఫాన్ కారణంగా సార్వా మాసూళ్లు కొన్ని రోజులు నిలిచిపోయాయి. వారం రోజుల్లో 80 వేల ఎకరాల్లో సాగు పనులు పూర్తయ్యాయి.
జిల్లాలో లక్షా 95 వేల ఎకరాల సార్వా పంటకు ఇప్పటివరకు లక్షా 35 వేల ఎకరాల్లో పనులు ముగిశాయి. ఇంకా 59 వేల ఎకరాల్లో మాసూళ్లు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులను నాలుగు రోజుల్లో పూర్తిచేయాలని రైతులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
మరోవైపు, దాళ్వా పంట కోసం నారుమడులు వేయడంపైన కూడా రైతులు దృష్టి సారించారు. ఈ సీజన్లో రెండు లక్షల 25 వేల ఎకరాలకు గాను, 10 వేల ఎకరాల్లో నారుమడులు వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 256 ఎకరాల్లో నారుమడులు వేయగా, వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని రైతులు యోచిస్తున్నారు. వచ్చే నెల 10వ తేదీలోపు నాట్లు పూర్తవుతాయని ఆశిస్తున్నారు. ఈ విధంగా నారుమడులు సక్రమంగా జరిగితే దాళ్వా పంట దిగుబడి మెరుగవుతుందని భావిస్తున్నారు.
అల్పపీడనంపై అప్రమత్తం: కలెక్టర్
ఆగ్నేయ బంగాళాఖాతంలో పశ్చిమ వాయవ్య దిశగా అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో ఈ నెల 11, 12 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా వరి కోతలు, నూడ్పులు చేపట్టాలని ఆమె రైతులకు సూచించారు. టార్పాలిన్లు అవసరం ఉన్న రైతులు స్థానిక ఆర్ఎస్కెలకు సమాచారం అందించాలన్నారు.
జిల్లాలో 4.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు 2,51,356 మెట్రిక్ టన్నులను 38,712 మంది రైతుల నుంచి సేకరించామని తెలిపారు. వీరికి రూ.578 కోట్ల చెల్లింపుల్లో రూ.561 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని ఆమె సూచించారు.
