తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలన అంశం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన విషయాన్ని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) గుర్తించిన నేపథ్యంలో.. తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేరూ ఈ జాబితాలో ఉందన్న సమాచారం కలకలం రేపుతోంది.
వైసీపీ పాలన కాలంలోనే షర్మిల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సమాచారం. అత్యంత గోప్యంగా నిర్వహించిన ఈ కార్యకలాపాల్లో ప్రత్యేక కోడ్ భాషను ఉపయోగించినట్లు తెలుస్తోంది. కేవలం ఆమె వాయిస్ కాల్స్‌ను రికార్డ్ చేయడం మాత్రమే కాకుండా.. ఆమె మాట్లాడే వ్యక్తుల వివరాలను కూడా సేకరించి, వెంటనే ఆమె సోదరుడు – అప్పటి సీఎం వైఎస్ జగన్‌కు చేరవేశారన్న ఆరోపణలు వెలువడుతున్నాయి.
తన చుట్టూ నిఘా నడుస్తోందన్న విషయం షర్మిల అప్పట్లోనే గుర్తించినట్లు సమాచారం. అంతేకాకుండా, షర్మిలకు సన్నిహితంగా ఉండే వ్యక్తులను ఓ సీనియర్ పోలీస్ అధికారి పిలిపించి హెచ్చరించినట్లు కూడా తెలిసింది.
ఈ వ్యవహారంపై షర్మిల దగ్గర కీలక ఆధారాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశముంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం మరింత వేడి రేపే అవకాశముంది.
